న్యాయం ఏడుస్తోంది: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ

  • ఈసీపై సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ పిటిషన్
  • తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మమత
  • ఈసీపై తీవ్ర విమర్శలు గుప్పించిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం (ఈసీఐ)పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వోటర్ లిస్ట్‌పై సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ ముందు వాదనలు జరిగాయి. “న్యాయం తలుపుల వెనక ఏడుస్తోంది” అంటూ మమత గట్టిగా అరిచారు. తాను మాట్లాడేందు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని కోరగా సీజేఐ అంగీకరించారు. 15 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఇచ్చారు.


మమత తన వాదన మొదలు పెడుతూనే ఈసీఐపై మాటల దాడి చేశారు. ఆరు సార్లు లేఖలు రాశాను కానీ ఒక్క స్పందన రాలేదని, ఎక్కడా న్యాయం దొరకడం లేదని ఆరోపించారు. భాషా సమస్యలు, స్పెల్లింగ్ మిస్‌మ్యాచ్‌ల వల్ల మాత్రమే వోటర్లను తొలగించకూడదని వాదించారు. వివాహం తర్వాత ఇంటి పేరు మారిన మహిళల పేర్లను తొలగించారని తెలిపారు. ఆధార్‌ను ఆమోదించకపోవడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన అని... ఇతర రాష్ట్రాల్లో డొమిసైల్, కుల సర్టిఫికెట్లు అంగీకరిస్తుంటే బెంగాల్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.


ఎన్నికల ముందు 3 నెలల్లో ఎందుకు ఇంత హడావుడి? నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ఎందుకు బెంగాల్‌ను మాత్రమే ఎంచుకున్నారు? అని ప్రశ్నించారు. బూత్ లెవల్ ఆఫీసర్ల మరణాలకు SIRతో సంబంధం ఉందని, హార్వెస్టింగ్ సీజన్‌లో 100 మందికి పైగా మరణాలు, హాస్పిటలైజేషన్లు జరిగాయని, అసోంలో ఎందుకు ఇలాంటివి లేవని విమర్శించారు. బెంగాల్‌ను “బుల్డోజ్” చేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడాలని ధర్మాసనాన్ని కోరుతున్నానని అన్నారు.


జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, వీఎం పంచోలి బెంచ్ మమతా పిటిషన్ జెన్యూన్ అని అంగీకరించింది. SIR నోటీసులు పంపేటప్పుడు అధికారులు కాస్త సెన్సిబుల్‌గా ఉండాలని ఈసీకి సూచించింది. అమర్త్యా సేన్, జాయ్ గోస్వామి, టీఎంసీ ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు నోటీసులు పంపడం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


మరోవైపు, మమత కోల్ కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టులో సొంతంగా వాదనలు వినిపించడం ఇదే తొలిసారి. 

Mamata Banerjee
West Bengal
Supreme Court
Election Commission of India
ECI
Voter list
Special Intensive Revision
SIR
Justice Suryakant
Calcutta High Court

More Telugu News